ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-మద్రాస్) కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. ఇటీవలే తెరుచుకున్న ఈ ప్రాంగణంలో కరోనా తిష్ట వేసింది. సుమారు వంద మందికి పైగా విద్యార్థులు కోవిడ్ బారిన పడ్డారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ తో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ను మూసేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో అన్లాక్ ల ప్రక్రియ మొదలుకాగానే.. పరిశోధక విద్యార్థులను క్యాంపస్ లోకి అనుమతించారు. అక్టోబర్ నుంచే పరిమిత సంఖ్యలో విద్యార్థులను క్యాంపస్ లోకి అనుమతిస్తున్నారు. క్యాంపస్ లోకి వచ్చే వారు కూడా ఖచ్చితమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… క్యాంపస్ లో మాత్రం కరోనా కేసులు తగ్గకపోవడం గమనార్హం.
ఐఐటీ మద్రాస్ లో 104 మంది కరోనా బారిన పడ్డారు. వీళ్లంతా పరిశోధక విద్యార్థులు. 774 మంది ఉంటున్న క్యాంపస్ లో వంద మందికి పైగా కరోనా అని తేలడంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. హస్టల్ ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా గదులను కేటాయించినా.. క్యాంపస్ లోనికి వచ్చే వాళ్లు కచ్చితమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలున్నాయి. చాలా మంది ఆ నిబంధనలను పాటిస్తున్నా.. క్యాంపస్ లో మాత్రం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.
భారీ స్థాయిలో కరోనా కేసులు వస్తుండటంతో.. కొద్దిరోజుల పాటు క్యాంపస్ ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. క్యాంపస్ లోని అన్ని విభాగాలు.. లైబ్రరీ, పరిశోధక కేంద్రాలను మూసేయాలని ఆదేశించారు. కరోనా బారిన పడ్డవారిలో ఎక్కువ మంది కృష్ణ, జమున హాస్టల్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు. మరో వైపు ఈ వార్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళిని స్వామి కూడా అధికారులను అప్రమత్తం చేశారు. కరోనా సోకినవారిని కింగ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ రీసెర్చ్ లో చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కరోనా సోకినవారంతా ఆరోగ్యంగానే ఉన్నారని క్యాంపస్ అధికారులు చెబుతున్నారు. పరిశోధక విద్యార్థులంతా ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్లే ఉండాలని.. వారికి కావలసిన ఆహారాన్ని సిబ్బందే సరఫరా చేస్తుందని తెలిపారు.